ePaper
Wednesday, June 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్లెనిన్ అన్నా,  అబ్రహం లింకన్  అభిప్రాయం వ్యక్తం చేసినా ఓటమే గెలుపును  నిర్దేశిస్తుంది....

లెనిన్ అన్నా,  అబ్రహం లింకన్  అభిప్రాయం వ్యక్తం చేసినా ఓటమే గెలుపును  నిర్దేశిస్తుంది….

📰 Generate e-Paper Clip

లెనిన్ అన్నా,  అబ్రహం లింకన్  అభిప్రాయం వ్యక్తం చేసినా ఓటమే గెలుపును  నిర్దేశిస్తుంది….

–వడ్డేపల్లి మల్లేశం 90142 06412.

సిద్దిపేట :

గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో విద్యారంగం ఎప్పుడైతే ప్రైవేటు  చేతుల్లోకి వెళ్లిపోయిందో అప్పటినుండి  బట్టి పద్ధతి అనివార్యమైపోయింది.  తద్వారా  ఆలోచన, వివేచన,  కార్యకారణ సంబంధం, అవగాహన, సమన్వయం  వంటి విలువలను విద్యారంగంలోనూ నిజజీవితంలోనూ క్రమంగా కోల్పోవడం జరిగింది. ఇది ఇటీవల కాలంలో సామాజిక వ్యవస్థకు జరిగిన పెద్ద దెబ్బ.  విజ్ఞానము, అవగాహన, వినియోగము  అనే పద్ధతిలో  విశ్వ జ్ఞానాన్ని అలవర్చుకునే సందర్భంలో విద్యార్థులకు  జంకు ఉండాల్సినటువంటి అవసరం లేదు. హేతుబద్ధత, వివేచన, కార్య కారణ సంబంధం,  అంతర్గత సంబంధాలను ఆకలింపు చేసుకోవడం ద్వారా  విద్యారంగంలోని పలు అంశాల పైన  స్పష్టమైన అవగాహన కలిగి ఉండడానికి ఆస్కారం ఉంది. అయితే బోధనా పద్ధతిలో  యంత్రాలను ఉపయోగించినప్పటికీ  ఆధునిక టెక్నాలజీని  సద్వినియోగం చేసుకున్నప్పటికీ  చదువు  పిల్లల పైన మోపుతున్న భారం అంతా ఇంతా కాదు. తద్వారా వాళ్ల చిన్నారి మెదళ్ల పైన  పడుతున్న భారాన్ని తగ్గించకపోతే భవిష్యత్తులో మరిన్ని చేదు పలాలను అనుభవించవలసి వస్తుంది.  ఇదే అంశాన్ని  అమెరికా మాజీ అధ్యక్షుడు  అబ్రహం లింకన్ తన స్వీయ అనుభవంతో పాటు తన కుమారుడిని పాఠశాలలో చేర్పించినప్పుడు  మాట్లాడిన తీరు ఆచరించిన విధానం  నాటికి నేటికి ఏనాటికైనా విద్యారంగంలో సమున్నతమైన విలువలను సాధించడానికి ఎంతగానో తోడ్పడుతుంది.  పరీక్షల్లో ఫెయిల్ అయినా తాత్కాలికంగా పెద్ద నష్టం లేదు కానీ జీవితంలో అపజయాల పాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది. అలాంటి విజ్ఞానాన్ని విద్యను అందించవలసిన బాధ్యత పాఠశాల ఉపాధ్యాయుల పైన ఉన్నది.  ముఖ్యంగా పరీక్షల సమయం వస్తుందంటే విపరీతమైన మానసిక ఒత్తిడికి గురికావడంతో  అంతో ఇంతో నేర్చుకున్నటువంటి అంశాలు కూడా స్ఫూరణకు రాకుండా పోయే ప్రమాదం ఉంది .అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్, రాజేంద్రప్రసాద్ లు విద్యా పరీక్షల విధానం పైన మాట్లాడిన సందర్భంలో చేసిన సూచనలు  ఈ సందర్భంగా ప్రస్తావించడం చాలా అవసరం.  “పరీక్షలు రాసే సమయంలో  తనకు అంతా తెలుసునని ఏ అంశాన్ని ఇచ్చినా ఏ కోణంలో రాయవలసిన ఉన్న రాస్తానని విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ఉండాలని, చెప్పారు.  అదే విద్యను నేర్చుకునేటప్పుడు  ఉపాధ్యాయుల ముందు  తమకు ఏమీ తెలవదని ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నదని భావించినప్పుడు మాత్రమే ఉత్సాహంతో మరింత ఎక్కువగా  ఒంట పట్టించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు సందర్భాలు కూడా  నేటి విద్యార్థులు పాటిస్తే తప్పకుండా ఫలితం కనబడుతుంది.
అబ్రహం లింకన్ కృషి-  అభిప్రాయాలు- విద్యార్థులతో సంబంధం .
********************6**********************
ప్రతి ఓటమిని కూడా గెలుపుకు అనుకూలంగా మార్చుకునే అంశాలను అనుభవాన్ని జ్ఞానాన్ని మనం అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ జీవితం నుండి కొంత గ్రహించవచ్చు.  వేయిసార్లు విఫలమైన లక్ష్యాన్ని సాధించడం కోసం ఎప్పుడు వెనుకాడకు అనే సామెత మనకు ఒకవైపు ఉండనే ఉన్నది.  ఆయన 1832 నుండి 1861 వరకు  ప్రతిసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తూ ఓడిపోయారు. కానీ ఏనాడు కూడా నిరాశ పడలేదు కనుకనే  నమ్ముకున్న సిద్ధాంతానికి  బలమైన స్పృహను జోడించడం ద్వారా  1861 లో ఆ దేశ 16వ అధ్యక్షులుగా ఎన్నిక కాగలిగినాడు.  అట్లనే ఆయన జీవితం వడ్డించిన విస్తరి మాత్రం కానే కాదు.  చిన్ననాడె తల్లి చనిపోవడంతో అనాధగా మారిపోవడం,  ఆస్తులు వివాదాల్లో కూరుకుపోవడంతో పేదరికం అనుభవించక తప్పని  దుస్థితి,  చదువు మీద ఆసక్తి ఉన్నప్పటికీ చదువుకునే అవకాశం లేకపోవడం,  తండ్రి సామాజిక స్పృహ లేని కారణంగా కొడుకును పనిలో పెట్టి వచ్చిన డబ్బుతో జల్సాలకు అలవాటు పడడం  ఆయన జీవితంలో పెను మార్పులకు దారి తీసినప్పటికీ  ఆందోళనల  నుండీ  రెట్టించిన చైతన్యవంతమైన జీవితాన్ని  ప్రారంభించడానికి అవకాశం దొరికింది., తండ్రి బాధ్యతారాహిత్యంతో ఇంటికి దూరమై  స్వచ్ఛందంగా బయటికి వెళ్లి ప్రాపంచిక పరిజ్ఞానాన్ని సాధించుకొని  రకరకాలు వ్యాపారాలు చేసినప్పటికీ నష్టపోవడం  ఉద్యోగాలలో స్థిరపడకపోయినప్పటికీ “లా” పూర్తి చేసి పూర్తి అర్హతను సాధించిన క్రమంలో  ప్రేమించిన అమ్మాయి అనారోగ్యంతో చనిపోవడం  పెళ్లి కూడా సజావుగా జరగకపోవడం  నలుగురు కొడుకులు పుడితే ముగ్గురు కొడుకులు అనారోగ్యానికి గురై తీరని దుఃఖంతో  జీవితం గడిపినప్పటికీ  ఇంత కన్నీళ్ల మధ్యన కూడా అమెరికా దేశ అధ్యక్షునిగా తన రాజకీయ జీవితం కొనసాగించి సఫలమైనతీరు ఎంతో ఆదర్శం.  కష్టాలు కన్నీళ్లను అనుభవిస్తూనే  తన కర్తవ్యాన్ని మరిచిపోకుండా ఎన్నికలకు సిద్ధమై  అత్యున్నత పదవిని సాధించే క్రమంలో తను పడినటువంటి ఆరాటం చేసిన పోరాటం అదే నిజమైన జీవితం గా మనం ప్రేరణ పొందాల్సిన అవసరం ఉంది.
ఈ సందర్భంగా తాను అమెరికా అధ్యక్షునిగా  తన కొడుకును పాఠశాలలో చేర్పించినప్పుడు ఉపాధ్యాయుడికి రాసిన ఒక లేఖలో  ఆయన పేర్కొన్న అంశాలు ” తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు”  స్పష్టం చేయడం నేటికీ  ప్రజల్లో చర్చనీయాంశంగా మిగిలిపోయింది. ” చదవంటే కేవలం మార్కులు ఎక్కువగా సాధించడం మాత్రమే కాదని,  విద్యార్థిని ఉత్తమ పౌరుడిగా భావి జీవిత సవాల్లను అధిగమించడానికి  సంసిద్ధుని చేయడమేనని, ఆ కృషి పట్టుదల ఉపాధ్యాయులతో పాటు వాతావరణం అనుకూలించాలని” ఆయన తన లేఖలో  ప్రస్తావించిన అంశం నాటికి ఈనాటికీ ఎప్పుడైనా  వర్తిస్తుంది. అబ్రహం లింకన్ నిజ జీవితంలో కూడా  ప్రకృతి నుండి సేకరించడం, సంసిద్ధులు కావడం,  కర్తవ్యాన్ని గుర్తించడం,  మూలాలను తెలుసుకోవడం, బాధ్యతాయుతంగా వ్యవహరించిన జీవితానికి సంబంధించి అనేక అనుభవాలను ప్రస్తావిస్తూ ఉంటారు. ఒక సందర్భంలో ఆయన ” ఒక చెట్టును నరకడానికి నాకు 6 గంటల సమయం ఇచ్చినట్లయితే మొదటి నాలుగు గంటలు గొడ్డలి పదును పెట్టడానికే ఉపయోగిస్తాను” అని అబ్రహం లింకన్  అనేవారని ఆయన జీవిత చరిత్ర ద్వారా తెలుస్తుంది.  అంటే “నామమాత్రపు ఫలితాల కంటే నైపుణ్య సాధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని,  మార్కుల కంటే పరిజ్ఞానం నైపుణ్యం ప్రతిభ జీవిత సవాల్లను అధిగమించే శక్తి ముఖ్యమని చెప్పకనే చెప్పినట్లు అయినది. ఈ వేగవంతమైన జీవితంలో, మార్కుల భ్రమలో, ప్రైవేటు కార్పొరేట్ పెట్టుబడిదారీ వ్యవస్థ నేపథ్యంలో,  ఇప్పటికీ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రైవేటు యాజమాన్యాలు చివరికి ప్రభుత్వాలు కూడా ఆలోచించవలసినటువంటిది ఏమిటంటే నైపుణ్యాన్ని ఇవ్వడం ద్వారా మాత్రమే విద్యార్థులకు మెరుగైన జీవితం కల్పించగలము  కానీ మార్కులు కాదని తెలుసుకుంటే మంచిది.”
ఒత్తిడి కారణంగా నేడు పాఠశాల స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు  అది అవసరమా? ఆలోచన వివేచన ప్రోత్సాహము నైపుణ్యము మానసిక ఆనందము విశ్లేషణ శక్తిని మరిచిపోయి  గుడ్డిగా మంచి మార్కులతో పాస్ కావాలని  అదే తన జీవిత లక్ష్యం అని నమ్మి మార్కులు రాకపోతే వెంటనే ఆత్మహత్యలకు పాల్పడడం అంటే  బాధ్యతల నుండి విస్మరించడమే. ఇ o దుకు తల్లిదండ్రులు పాఠశాలలు పెద్ద మొత్తంలో బాధ్యత వహించవలసి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయగలిగే నూతన వ్యవస్థను విద్యారంగంలో కల్పించాలి.  మానసిక నిపుణులు సామాజికవేత్తలు కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు సంబంధించి  ఉన్నతమైన విలువలను ప్రతిష్టింప చేసే క్రమంలో ముందు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా  పరీక్షల వ్యవస్థను సంస్కరించుకుంటే చాలా మంచిది.  .ఓటమి గెలుపుకు తొలిమెట్టు అని లక్ష్యాన్ని చేరుకున్నటువంటి  లెనిన్ మాటలు కూడా  సందర్బోచితాలు, అక్షర సత్యాలు,  నిజజీవిత అనుభవాలకు ఆనవాళ్లు కూడా.

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!