*వ్యవసాయ అనుబంధ రంగాలను బ్యాంకర్లు ప్రోత్సహించాలి*
*జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల*
నెల్లూరు, మార్చి 6 : వ్యవసాయ అనుబంధ రంగాలను బ్యాంకర్లు ప్రోత్సహించేలా రైతులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల బ్యాంకర్లకు సూచించారు.
శుక్రవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లాస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చేపట్టిన కార్యాచరణ వివరాలను లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంకు మేనేజర్ మణిశేఖర్ కలెక్టర్‌కు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ వల్ల రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని, ఖర్చులు తగ్గి వ్యవసాయం మరింత సులభతరం అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, డ్రోన్‌లు వంటి పరికరాల కొనుగోలుకు అన్ని బ్యాంకులు ఉదారంగా రుణాలు మంజూరు చేయాలన్నారు.
పశు, మత్స్య, కోళ్ల పరిశ్రమలను ప్రోత్సహించేలా బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉన్న రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దరఖాస్తులను తిరస్కరించకుండా ఎక్కువ మందికి రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. మన జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి మొదలగు ఉద్యాన పంటలకు రుణాలను మంజూరు చేసి తోడ్పాటు అందించాలన్నారు.
పీఎం సూర్యఘర్ పథకాన్ని జిల్లాలో విస్తృతంగా ప్రజలు సద్వినియోగం చేసుకునేలా బ్యాంకర్లు వెంటనే రుణాలు మంజూరు చేయాలని సూచించారు. చిన్న వ్యాపారాలను ప్రోత్సహించేలా ముద్ర రుణాలు, పీఎంఈజీపి రుణాలను మంజూరు చేయాలని కోరారు.
జిల్లాలోని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన యాక్టివ్ గా లేని అకౌంట్లను వెంటనే యాక్టివ్ చేయించాలని సంబంధిత శాఖల హెచ్వోడీలకు సూచించారు. ఈ విషయమై బ్యాంకులతో సమన్వయం చేసుకుని వెంటనే తగిన పత్రాలతో ఈకేవైసి పూర్తి చేయించి బ్యాంకు ఖాతాలను పునరుద్ధరించాలని సూచించారు.
ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ మణిశేఖర్, డిఆర్వో విజయ్ కుమార్, నాబార్డ్ డిడిఎం బాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవేణి, డీఆర్‌డీఏ, డ్వామా, మెప్మా పీడీలు నాగరాజకుమారి, గంగా భవాని, లీలారాణి, పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖ, ఉద్యానవన శాఖ అధికారులు రమేష్‌నాయక్, చాన్ బాషా, సుబ్బారెడ్డి తదితరులు, వివిధ శాఖల బ్యాంకర్లు పాల్గొన్నారు.
*DIPRO, I&PR, NELLORE*

