*జొన్నవాడ శ్రీ కామాక్షితాయి అమ్మవారి సన్నిధిలో ఘనంగా సౌందర్య లహరి పారాయణం*
– వేమిరెడ్డి దంపతుల సమక్షంలో 500 మంది మహిళలతో సౌందర్య లహరి ఆలాపన.
నెల్లూరు( ఇదినిజం ప్రతినిధి ):
బుచ్చిరెడ్డి పాళెం మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రం జొన్నవాడ శ్రీ కామాక్షితాయి అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన ‘సౌందర్య లహరి’ మరియు ‘మూక పంచశతి’ పారాయణ కార్యక్రమంలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిన్నవాడ కామాక్షి అమ్మవారి సన్నిధికి విచ్చేసిన వేమిరెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం వేమిరెడ్డి దంపతులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలతో పాటు అమ్మవారి జ్ఞ్యాపిక అందజేసి ఘనంగా సన్మానించారు.
అనంతరం 500 మంది మహిళలు సౌందర్య లహరిని పారాయణమనే అద్భుత ఆధ్యాత్మిక ఘట్టాన్ని వీక్షించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గార్లు నిర్వాహకులను ప్రశంసించారు. ఆది శంకరాచార్యులు రచించిన సౌందర్య లహరి కేవలం శ్లోకం మాత్రమే కాదని, అది అమ్మవారి అనుగ్రహమని, దీనివల్ల ప్రజలకు ఆధ్యాత్మికంగా, మానసికంగా ఎంతో స్వాంతన చేకూరుతుందని వారు పేర్కొన్నారు.
జొన్నవాడ కామాక్షితాయి అమ్మవారి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నేరెళ్ల పద్మశ్రీ బృందాన్ని వేమిరెడ్డి దంపతులు ప్రత్యేకంగా అభినందించారు. శృంగేరీ పీఠం వారి ఆన్‌లైన్ క్లాసుల ద్వారా శిక్షణ పొంది సామాన్య ప్రజలకు సౌందర్య లహరిని చేరువ చేస్తున్న నేరెళ్ల బృందం కృషితో ఇప్పటికే జనవరిలో గురువాయూర్‌లో మొదటి కార్యక్రమం జరిగిందని ఇప్పుడు రెండో కార్యక్రమం జొన్నవాడలో నిర్వహించడం సంతోషకరమని వారు కొనియాడారు. ప్రజలందరిపై కామాక్షితాయి, మల్లికార్జున స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని వారు ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జొన్నవాడ ఆలయ ఛైర్మెన్ తిరుమూరు అశోక్ రెడ్డి, ఆలయ పరిపాలనాధికారి శ్రీనివాసులు రెడ్డి, ఆలయ పాలక మండలి సభ్యులతో పాటు స్థానిక తెలుగుదేశం మరియు కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు.