idhinijam.com
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 8:48 pm Digital Edition : Idhi Nijam Desk

జిల్లా కాంగ్రెస్ మకుటంలో తురాయి కలికి యానాది రెడ్డి…..

.నేడు ఆయన వర్థంతిని ఘనంగా నిర్వహించేందుకు అనుచరుల ఏర్పాట్లు..

కావలి (ఇదినిజం ప్రతినిధి

కావలి రాజకీయాలలో విలక్షణ నేత, కావలి పేరును జాతీయస్థాయిలోనికితీసుకొని వెళ్ళిన నాయకుడు స్వర్గీయ కలికి యానాదిరెడ్డి. కావలి అంటే కలికి, కలికి అంటేకావలి అనే రీతిలో కావలిపై నాలుగు దశాబ్దాల పాటు తన పట్టును నిలుపుకున్న రాజకీయయోధుడు. సాధారణ రైతు కుటుంబములో అప్పటి కావలి నియోజకవర్గంలోని జమ్మలపాలెంగ్రామంలో కలికి రామిరెడ్డి-మునెమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు. ఆదినుండి అదే తీరు. ఆత్మగౌరవం కోసమే కలికి పోరు. ముఖ్యమంత్రి అయిన, పి.సి.సి. అధ్యక్షుడుఅయినా, జిల్లా మంత్రి అయినా వారు ఎంతటి వారయినా కలికి అనుమతి లేనిదే కావలిలోఅడుగు పెట్టడానికి వీలు లేదు. కావలి విషయం మనకెందుకు అని మర్రి చెన్నారెడ్డి లాంటిముఖ్యమంత్రి సైతం కావలి మీద వెళుతూనే కావలి వైపు కన్నెత్తి చూడకుండా వెళ్ళారు. సాధారణ గ్రామ సర్పంచ్ స్థాయి నుండి రాష్ట్ర మంత్రిస్థాయికి ఎదిగారు. ఎంత ఎదిగినా ఒదిగివుండే నైజమే ఆయనను ఆ స్థాయికి తీసుకొని వెళ్ళింది. ఇందిరా గాంధీ సైతం యానాదిరెడ్డి అంటే గుర్తు పట్టగలిగే స్థాయిలో ఆయన నిలిచారని చెప్పడం అతిశయోక్తి కాదు. 1967 అసెంబ్లీ ఎన్నికలలో గొట్టిపాటి సుబ్బానాయుడు గెలుపు కోసం పనిచేయడం ద్వారా అప్పటి కావలి నేతల దృష్టిలో పడ్డారు. ఫలితంగా 1968లో జమ్మలపాలెం సర్పంచ్గా ఎన్నికైనారు. సర్పంచ్ గా ఎన్నికైన 2 ఏళ్ళకే కావలిలో బలమైన నాయకుడిగా ఉన్న వేమిరెడ్డి అయ్యపరెడ్డి నియోజకవర్గరాజకీయాలలో బలమైన వ్యక్తిగా ఉన్న గొట్టిపాటి కొండపనాయుడుని వెనక్కు నెట్టి కావలిసమితి అధ్యక్షునిగా ఎన్నికైనారు. 1972లో గొట్టిపాటి కొండపనాయుడు కావలి నుండి ఇండిపెండెంట్ ఎమ్.ఎల్.ఏ. గా గెలిచారు. ఆయన యం.యల్.ఏ. అయిన కొద్దిరోజులకే కలికిస్వతంత్రతను ప్రకటించుకొని తాను ప్రత్యేకంగా ఒక బలమైన వర్గాన్ని నిర్మించారు. అప్పటి రాష్ట్రముఖ్యమంత్రి జలగం వెంగళరావుతో సన్నిహిత సంబంధాలు కలిగి మెలుగుతూ, స్థానికయం.యల్.ఏ. కొండపనాయుడు జిల్లా రాజకీయ పెత్తనం చేస్తున్న ఆనం వారికి కూడాఅంతుచిక్కకుండా తన పనులు చక్కపెట్టుకుంటూ, తన వర్గాన్ని రోజురోజుకూ పెంచుకోసాగారు.1978 అసెంబ్లీ ఎన్నికలలో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోనికి దిగిన యానాది రెడ్డికొండపనాయుడు, అయ్యపరెడ్డిలతో పాటు నాటి అధికార రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు రమణారెడ్డిడిపాజిట్ కూడా రాకుండా చేసి సంచలన విజయం సాధించారు. అలా అసెంబ్లీలో అడుగుపెట్టిన కలికి 1985, 1989, 1994 ఎన్నికలలో వరుస విజయాలు సాధించి, హ్యాట్రిక్ కొట్టారు.ఆయన హ్యాట్రిక్ ను ఇప్పటి వరకూ అందుకున్నవారు లేకపోవడం విశేషం. 1994 ఎన్.టి.ఆర్. ప్రభంజనంలో రాష్ట్రంలో హేమాహేమీలైన కాంగ్రెస్ నాయకులు ఓటమి చెందారు. జిల్లాలో10 స్థానాలు టి.డి.పి. గెలిచింది. కావలిలో మాత్రం కలికి కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించి దటీజ్ కలికి అని కాంగ్రెస్ అగ్రనాయకుల చేత ప్రశంసలను పొందారు. కాబోయే ముఖ్యమంత్రి వై.యస్. అని తొలుత ప్రకటించిన కాంగ్రెస్ నేత కూడా ఈ ధీశాలే. 1993లో కోట్ల విజయభాస్కర్రెడ్డి మంత్రివర్గంలో సహకార, దేవాదాయ శాఖలు నిర్వహించి, కావలి నుండి తొలిసారి మంత్రిఅయిన ఘనతను సొంతం చేసుకున్నారు. హేమాహేమీలను ఎదిరించిన కలికి చివరికి2004 అసెంబ్లీ ఎన్నికల సమయములో మాగుంట కుటుంబ రాజకీయ చదరంగంలో ఓడి,టిక్కెట్టును కోల్పోయారు. ఈ ఎన్నికలలో మాగుంట పార్వతమ్మ కావలి కాంగ్రెస్ టిక్కెట్టుతెచ్చుకున్నారు. అయితే అభిమానులు, అనుచరులు, ప్రజలు ఇండిపెండెంట్గా బరిలోనికి దిగమని కలికికి ఎన్నోరకాలుగా చెప్పినా ఆయన నిబద్దత కలిగిన కాంగ్రెస్ వాదిగా మండుటెండలను,తన వయస్సును సైతం లెక్కచేయక, పార్వతమ్మను యం.యల్.ఏ.గా గెలిపించుటకు చేసిన కృషి అవిరళమైనది. కాంగ్రెస్ కు ఇంత చేసిన కలికికి ఆ పార్టీ 2004లో అధికారంలోనికి వచ్చాక ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వలేదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆత్మ గౌరవ పతాకగా జిల్లా కాంగ్రెస్ మకుటంలో తురాయిగా వెలుగొందిన ఈ అభిమానధనుడు 2006 మే 5న తనువు చాలించాడు. ఈ ఆత్మగౌరవ పతాకకు మరణం లేదు. కావలి రాజకీయ చరిత్ర వున్నంత వరకూ ఆయన పేరు సుసంపన్నం అనేది ప్రజల అభిప్రాయం. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు ఆయన అభిమానులుఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కావలి కీర్తిపతాకకు అక్షరాంజలి !

డా. ఎస్. బాబురావు