కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేసిన అధికారులు:
- పౌరహక్కుల సమావేశానికి కీలక శాఖల అధికారుల డుమ్మా…
మర్రిపాడు:(ఇదినిజం ప్రతినిధి ):
మర్రిపాడు మండలం కదిరినేనిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం స్థానిక తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవ సమావేశానికి పలు కీలక శాఖల అధికారులు గైర్హాజరుకావడం విమర్శలకు తావిచ్చింది. సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాల్సిన విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, ఐసీడీఎస్, ఆర్‌డబ్ల్యూఎస్, వ్యవసాయ శాఖలకు చెందిన అధికారులు డుమ్మా కొట్టడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలను నిర్లక్ష్యం చేసినట్లు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన సమస్యలను నేరుగా విని పరిష్కరించాల్సిన సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు హాజరుకాకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య, విద్యుత్ అంతరాయాలు, పాఠశాలలో నాలుగో, ఐదో తరగతుల ఏర్పాటు, ఆరోగ్య సేవలు, చిన్నారులకు అందాల్సిన ఐసీడీఎస్ సేవలు వంటి అంశాలు ఈ శాఖల పరిధిలోనే ఉన్నప్పటికీ, అధికారులు గైర్హాజరుకావడంతో గ్రామస్తులకు సరైన సమాధానాలు లభించలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత కీలకమైన శాఖల అధికారులు గైర్హాజరుకావడంపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇటువంటి నిర్లక్ష్యంపై జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.